Ephesians 6

ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల గృహ జీవనం

1పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. 2
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Eph 6:3.
In this translation, this verse contains text which in some other translations appears in verses Eph 6:2-Eph 6:3.
3“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.

4తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.

5సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6మనుషుల్ని సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి. 8దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.

9యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.

ఆత్మతో నిండిన విశ్వాసుల పోరాటం

10చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

శత్రువులు

12ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

కవచం

13అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

14మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.

17ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

18ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.

19సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.

21నా ప్రియ సోదరుడు తుకికు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. అతని ద్వారా నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో మీకు తెలుస్తుంది. 22మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ప్రోత్సహించడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.

23తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు శాంతినీ విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులకు అనుగ్రహించు గాక 24మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉండుగాక.

Copyright information for TelULB